News Updatesపదో తరగతి.. ప్రతి విద్యార్థి జీవితంలో కీలక మలుపు..
ఉన్నత చదువులకు బాటలు పరచే తరుణం.. మంచి గ్రేడ్‌ సాధించి పైచదువులకు వెళ్లేందుకు విద్యార్థులు ఉవ్విళ్లూరుతుంటారు. అంతకు ముందు తరగతుల్లో పరీక్షలంటే ఆడుతూ.. పాడుతూ రాసేస్తూ.. ఎలాంటి ఒత్తిడి లేకుండా సాగిపోతాయి. పదో తరగతి పరీక్షలగానే కొందరు విద్యార్థులకు లోలోపల ఏదో తెలియని భయం.. తమకు తెలియకుండానే ఆందోళన చెందుతుంటారు. ముఖ్యంగా పరీక్షలు సమీపించే కొద్దీ మనుసులో ఒత్తిడికి గురువుతూ.. పరీక్షలపై ప్రతికూల పెంచుకుంటారు. ఎలా గట్టెక్కాలన్న ఆలోచనల్లో మునిగిపోతుంటారు.
ఇలాంటి ఆలోచనలేమి లేకుండా సాఫీగా.. ప్రశాంతంగా పరీక్షలకు హాజరైతే సులువుగా మంచి శ్రేణి సాధించవచ్చని చెబుతున్నారు ఉపాధ్యాయులు, మనస్తత్వ నిపుణులు. పరీక్షలకంటే ప్రతిభా సామర్థ్యాలకు కొలమానం కాదు. చదువుకున్న అంశాలను మరోసారి జ్ఙప్తికి తెచ్చుకోవడమేనని చెబుతున్నారు. మరో రెండు రోసుల్లో (ఈ నెల 19 నుంచి) పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పరీక్ష కేంద్రాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? పరీక్షల రోజు ఎలా ఉండాలి.. ముందు రోజు ఎలా ఉండాలి..? చదివిన అంశాలపై చివరి నిమిషంలో ఎలా పట్టు సాధించాలో మన నిపుణలు వివరిస్తున్నారు.

ముందు రోజే పరీక్షా కేంద్రం పరిశీలన
పదో తరగతి పరీక్షలు జంబ్లింగ్‌ విధానంలో జరుగుతున్నాయి. తమకు తెలిసిన తోటి విద్యార్థులందరికీ ఒకే చోట పరీక్ష కేంద్రం ఉండకపోవచ్చు. పరీక్ష ప్రారంభం రోజు హడావికి పడే కంటే ఒక రోజు ముందుగానే పరీక్ష కేంద్రానికి వెళ్లి పరిశీలించి రావడం మేలు. అక్కడికి సులువుగా ఎలా చేరుకోవచ్చు..? రవాణా సదుపాయాలు ఏమేం ఉన్నాయో.. తెలుసుకుంటే పరీక్ష రోజు ఇబ్బంది లేకుండా ఉంటుంది.

పరీక్ష గది.. భయం వద్దు
చాలా మంది విద్యార్థులకు పరీక్ష అనగానే లేదా పరీక్ష హాలులోకి వెళ్లగానే ఏదో తెలియని భయం ఆవహిస్తుంది. తలనొప్పి రావడం, కళ్లు తిరగడం, వాంతులు, వికారంగా మారడం కూడా జరుగుతాయి. కంగారు పడతారు. దీన్ని సిచ్యువేషనల్‌ యాంగ్జ్రైటీ అంటారు. సమాధానాలు సరిగా రాయలేరు. పరీక్షను ఏదోలా రాసేసి బయటకు వస్తారు. ఏడాదంతా కష్టపడి చదివినా.. ప్రయోజనం లేదన్నట్లుగా పరిస్థితి మారుతుంది. ఈ లక్షణాలు తగ్గించుకునేందుకు కొన్ని పద్ధతులు పాటిస్తే ఎంతో మేలు. యోగా, ధాన్యం, ప్రాణాయామం వంటివి చేస్తే ప్రయోజనం ఉంటుంది. సానుకూల దృక్పథాన్ని అలవరచుకుని.. ^^నేను చేయగలను.. నేను రాయగలను.. ^^ కచ్చితంగా మంచి మార్కులొస్తాయి.. ^^ అన్న ఆలోచనలు మనసులో బలంగా అనుకోవాలి. పరీక్ష హాలును రెగ్యులర్‌ తరగతి గదిలానే భావించాలి. ప్రతికూల ఆలొచనలను దరిదాపుల్లోకి రానివ్వకుండా ఉండాలి.

చదివిన అంశాలు గుర్తులేవా?
చాలా మంది విద్యార్థులు ఎంతో కష్టపడి ఏడాదంతా చదువుతారు. రివిజన్‌ సమయంలో పగలూరాత్రి తేడా లేకుండా పుస్తకాలతో కుస్తీ పట్టెస్తారు. తీరా.. పరీక్ష సమయానికి ఏమి గుర్తులేవని ఆందోళన పడుతుంటారు. విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా చదవడం కారణంగానే ఈ తరహా భావన ఏర్పడుతుంది. సమగ్ర అవగాహనతో చదివిన అంశాలు మరిచిపోయే అవకాశం ఉండదని గుర్తుంచుకోవాలి. కేవలం పరీక్షల కోణంలో చదివి బట్టీ పట్టడం కాదు.. దైనందిన జీవితానికి అన్వయించుకుంటే మరిచిపోయే సమస్య ఉండదు. చదివిన అంశాలు మరిచిపోయి ^^శూన్యత^^ ఏర్పడిందని భావిస్తే.. కొన్ని పద్ధతులు పాటిస్తే మేలు.
తమకు నచ్చిన అంశాన్ని గుర్తుకు తెచ్చుకుని మనసును ఆహ్లాదంగా ఉంచుకోవాలి. నెమ్మదిగా నేలపై నడుస్తూ.. ఆకాశంవైపు చూస్తూ ఐదారు సార్లు అటూ.. ఇటూ తిరగాలి. దీన్ని స్కై వాకింగ్‌ అంటారు.
గుర్తు లేవని భావించిన అంశాన్ని 45 నిమిషాల పాటు చదివి పుస్తకం మూసివూసి.. తిరిగి గుర్తు చేసుకోవాలి.
టీవీలు, సినిమాలపై ధ్యస పెట్టకూడదు. దీంతో ఆలోచనలు వాటిపైకి మళ్లీ ప్రమాదం ఉంది.

రోజు ఇలా చేస్తే మేలు..
నిర్దేశిత సమయానికన్నా ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి.
పరీక్ష ప్రారంభించే ముందు ఐదారు సార్లు దీర్ఘంగా శ్వాస తీసుకోవడం మంచిది. దీంతో ఒత్తిడి తగ్గి మెదడు బాగా పనిచేస్తుంది.
ప్రశ్నపత్రాన్ని పేర్తిగా చదవాలి. తొలుత బాగా తెలిసిన జవాబును రాయాలి. దీంతో బాగా రాయగలనన్న ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
జవాబు పత్రంలో మొదటి నుంచి చివరివరకు దస్తూరి(హ్యాండ్‌ రైటింగ్‌) ఒకేలా ఉండేలా చేసుకోవాలి.
మధ్యలో ఒత్తిడి అనిపిస్తే గట్టిగా శ్వాస పీల్చుకుని వదలాలి.