News Updates1. ఏపీలో యథావిధిగా పది పరీక్షలు

రాష్ట్రంలోని విద్యాసంస్థలకు ఈనెల 31 వరకు సెలవులు ప్రకటించినట్లు ఏపీ విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాఠశాలలు, కళాశాలలు, వర్సిటీలు, కోచింగ్‌ సంస్థలు, నర్సింగ్‌ కళాశాలలకు సెలవులు ప్రకటించినట్లు చెప్పారు. ఈనెల 23 వరకు ఇంటర్‌ పరీక్షలు యథావిధిగా జరుగుతాయని తెలిపారు.  పదో తరగతి పరీక్షలు మార్చి 31 నుంచి యథావిధిగా నిర్వహిస్తామని వెల్లడించారు. పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు

2. విదేశాల్లో విలవిల్లాడుతున్న తెలుగు విద్యార్థులు

విదేశాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు కరోనా ప్రభావంతో విమానాశ్రయాల్లో చిక్కుకు పోయారు. భారత్‌కు వచ్చే విమానాలు రద్దు కావడంతో ఫిలిప్పీన్స్‌లోని మనీలా విమానాశ్రయంలో పలువురు తెలుగు విద్యార్థులు అవస్థపడుతున్నారు. మనీలాలో సుమారు 40గంటలుగా నిద్రాహారాలు లేకుండా పడిగాపులు కాస్తున్నారు. నేలపైనే పడుకుంటూ 80 మంది ఇబ్బంది పడుతున్నారు. మరో వైపు మలేసియాలోని కౌలాంలంపూర్‌ నుంచి 185 విద్యార్థులు విశాఖకు చేరుకోగా వారిని పరీక్షించిన వైద్యులు అనంతరం వారి ప్రాంతాలకు తరలించారు.

3. రాజ్యసభ సభ్యునిగా రంజన్‌ గొగోయ్‌ ప్రమాణం!

సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంటులో తన సభ్యత్వం గురించి ఆయన సమర్థించుకున్న ఆయన, తన హజరు వలన న్యాయవ్యవస్థకు సంబంధించిన విషయాలను పార్లమెంటులో చర్చించే అవకాశంగా భావిస్తున్నట్లు అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే, రంజన్‌ గొగోయ్‌ను రాజ్యసభకు నామినేట్‌ చేస్తూ రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నారు. అనంతరం రాజ్యసభ సభ్యునిగా నామినేట్‌ చేస్తూ హోంమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

4. దేశంలో 169కు చేరుకున్న కరోనా కేసులు!

దేశంలో 18రాష్ట్రాల్లో విజృంభిస్తోన్న కొవిడ్‌-19 కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా ఛండీగడ్‌లో కొత్తగా కరోనా వైరస్‌ కేసు నిర్ధారణ అయ్యింది. 23ఏళ్ల యువతి గత ఆదివారం లండన్‌ నుంచి భారత్‌కు చేరుకుంది. మరుసటి రోజు ఆమెలో కరోనా లక్షణాలు భయటపడటంతో వైద్య పరీక్షలు నిర్వహించారు. దీంతో కొవిడ్‌-19 ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందని అధికారులు వెల్లడించారు. ఇలా గురువారం నాటికి దేశంలో కరోనా కేసుల సంఖ్య 169కు చేరుకుందని కేంద్ర కుటుంబ, ఆరోగ్యశాఖ ప్రకటించింది.

6. ఈడీ ముందు హాజరైన అనిల్‌ అంబానీ!

యెస్‌బ్యాంకు కేసులో సమన్లు అందుకున్న అడాగ్‌ గ్రూపు చైర్మన్‌ అనిల్‌ అంబానీ ఈరోజు ముంబయిలోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌(ఈడీ) అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. యెస్‌బ్యాంకు నుంచి తీసుకున్న రుణాల విషయంలో అనిల్‌ అంబానీ వాంగ్మూలాన్ని రికార్డు చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా అడాగ్‌ గ్రూపునకు చెందిన మరికొందరిని కూడా ఈడీ త్వరలోనే విచారించనున్నట్లు సమాచారం. ఇప్పటికే యెస్‌బ్యాంకు వ్యవస్థాపకుడు రాణాకపూర్‌ను మనీలాండరింగ్‌ కేసులో అరెస్టు చేసిన అధికారులు కొన్ని రోజులుగా విచారిస్తున్నారు.

7. కరోనా కట్టడికి చర్యలు: పీవీ రమేశ్‌

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి పి.వి.రమేష్‌ తెలిపారు. సచివాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... అందరూ మాస్క్‌లు వేసుకోవాల్సిన అవసరం లేదని, చేతులు శుభ్రంగా ఉంచుకుంటే సరిపోతుందన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని వివరించారు. కరోనా వైరస్‌ నిర్ధారణకోసం రక్త నమూనాలు పుణెకు పంపకుండా మన రాష్ట్రంలోనే పరీక్షించే విధంగా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.

8. కరోనాపై ‘నిశ్శబ్ధం’ స్పందన

ప్రపంచదేశాల్లో కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) రోజురోజూకీ తీవ్రరూపం దాలుస్తోన్న తరుణంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొంటూ పలువురు నటీనటులు సోషల్‌మీడియా వేదికగా వీడియోలు పోస్ట్‌ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ‘నిశ్శబ్దం’ టీం సైతం ఓ ప్రత్యేకమైన వీడియోను పోస్ట్‌ చేసింది. ఈ వీడియోలో అనుష్క శెట్టి, సుబ్బరాజు, అవసరాల శ్రీనివాస్‌తోపాటు దర్శకుడు హేమంత్‌ మధుకర్‌ కరోనా బారినపడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియచేశారు.

9. నిర్భయ దోషి పిటిషన్‌ కొట్టివేసిన సుప్రీంకోర్టు

మరణ శిక్షను జీవిత ఖైదుగా కుదించాలని నిర్భయ దోషి పవన్‌ గుప్తా పెట్టుకున్న క్యురేటివ్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ధర్మాసనం పవన్‌ గుప్తా పిటిషన్‌పై గురువారం విచారణ నిర్వహించింది. అతడి పిటిషన్‌ను కొట్టివేస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. నిర్భయ దోషులు నలుగురికి రేపు ఉదయం 5.30 గంటలకు ఉరిశిక్ష అమలు చేయాలని పటియాలా కోర్టు డెత్‌ వారెంట్లు జారీ చేసిన విషయం తెలిసిందే.