News Updates1. మధ్యప్రదేశ్‌ సీఎం కమల్‌నాథ్‌ రాజీనామా

మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ తన పదవికి రాజీనామా చేశారు. బలపరీక్షకు ముందే మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయం వెల్లడించారు. ‘‘15 నెలల పాటు రాష్ట్రాభివృద్దికోసం కష్టపడి పనిచేశాం. ఐదు సంవత్సరాలు పాలించమని ప్రజలు మాకు అవకాశం కల్పించారు. 2018 డిసెంబరులో మా ప్రభుత్వం ఏర్పడింది. మెజార్టీ స్థానాలు గెలుచుకుని మా పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ, మా ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు భాజపా అన్ని ప్రయత్నాలు చేసింది. ప్రజల నమ్మకాన్ని భాజపా వమ్ము చేసింది. మా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అనేక కుట్రలు పన్నారు’’ అని కమల్‌నాథ్‌ విమర్శించారు.

2. రమేష్‌ కుమార్‌కు భద్రత కల్పిస్తాం: కిషన్‌రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల అధికారి రమేష్‌ కుమార్‌ భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఆయనకు పూర్తి భద్రత కల్పిస్తామని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... రమేష్‌కుమార్‌ లేఖ వ్యవహారంపై స్పందించారు. ‘‘రమేష్‌ కుమార్‌ నుంచి కేంద్ర హోంశాఖకు లేఖ వచ్చింది. లేఖపై ఏపీ సీఎస్‌తో కేంద్ర హోంశాఖ కార్యదర్శి మాట్లాడారు. లేఖ ఆయన రాసినట్లుగానే భావిస్తున్నాం’ అని వ్యాఖ్యానించారు.

3. కార్యాలయాల తరలింపునకు ఏపీ హైకోర్టు బ్రేక్‌

విజిలెన్స్‌ కమిషనర్‌, కమిషనరేట్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ ఛైర్మన్‌, సభ్యుల కార్యాలయాలను వెలగపూడి నుండి కర్నూలుకు తరలించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన చర్యలకు అడ్డుకట్ట పడింది. కార్యాలయాల తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వం జనవరి 31న జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ జరిపింది. వాదనలు విన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం ..రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

4. పరీక్షాకేంద్రాల వద్ద జాగ్రత్త చర్యలు: మంత్రి సబితా

కరోనా వైరస్‌ దృష్ట్యా పదోతరగతి పరీక్షా కేంద్రాల వద్ద అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం ఉదయం నగరంలోని బోరబండ, యూసఫ్‌గూడలోని పరీక్షా కేంద్రాలను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ...కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న తరుణంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. విద్యార్థులు మాస్క్‌లు, శానిటైజర్లు వెంట తెచ్చుకున్నా... పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తున్నట్లు తెలిపారు.

5. ‘నిర్భయ’ కోసం అమ్మ పోరాటం

‘‘నా కుమార్తెకు న్యాయం జరిగింది. ఆలస్యమైనప్పటికీ చివరకు న్యాయమే గెలిచింది. దోషుల ఉరితో నా కూతురి ఆత్మ శాంతిస్తుంది. ఇంతటితో నా పోరాటం ఆగదు. ఇలాంటి కేసుల్లో సత్వర న్యాయం కోసం పోరాడుతూనే ఉంటా’’ అని నిర్భయ దోషుల్ని ఉరితీసిన తర్వాత ఆమె తల్లి ఆశాదేవి స్పందన ఇది. ఈ రోజు ఆమె సంతోషం వెనుక ఏడేళ్లకు పైగా ఎంతో ఆవేదన దాగిఉంది. చట్టంలో ఉన్న లొసుగులను వాడుకొని శిక్ష నుంచి తప్పించుకొనేందుకు దోషులు చేస్తున్న ప్రయత్నాలను చూసి ఆమె ఒక దశలో నిస్సహాయంతో ఆక్రోశించారు.

6. న్యాయమే గెలిచింది: మోదీ

నిర్భయ దోషుల ఉరిపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ‘‘ఎట్టకేలకు న్యాయమే గెలించింది. మహిళలకు భద్రత, గౌరవాన్ని కల్పించడం చాలా ముఖ్యం. ప్రతి రంగంలో మన మహిళా శక్తి రాణిస్తోంది. మహిళా సాధికారితకు అత్యంత ప్రాముఖ్యతనిస్తూ వారికి సమాన అవకాశాలు కల్పించే మెరుగైన సమాజాన్ని అందరం కలిసి నిర్మిద్దాం’’ అని మోదీ పిలుపునిచ్చారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ కూడా దోషుల ఉరిపై స్పందించారు.

7. జనతా కర్ఫ్యూ ఫాలో అవ్వండి

ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వైరస్‌ (కొవిడ్‌ 19) కారణంగా ఇప్పటికే వేల మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్‌ నివారణకు ప్రజలంతా స్వచ్ఛందంగా ‘జనతా కర్ఫ్యూ’ పాటించాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. ఈనెల 22న ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 వరకు దేశ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని కోరారు. మోదీ పిలుపునకు టీమ్‌ఇండియా క్రికెటర్లు స్పందించారు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, కోచ్‌ రవిశాస్త్రితో సహా అనేక మంది క్రికెటర్లు ‘జనతా కర్ఫ్యూ’ పాటించాలని ట్విటర్‌లో కోరారు.

8. ఒక్కరిగా ఉండండి.. జాగ్రత్తగా ఉండండి: అమితాబ్‌

భారత్‌లో చాపకింద నీరులా వ్యాపిస్తున్న కరోనా వైరస్‌ను కట్టడి చేయడమే లక్ష్యంగా ప్రధాని మోదీ పిలుపునిచ్చిన ‘జనతా కర్ఫ్యూ’పై బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ స్పందించారు. మార్చి 22న (ఆదివారం) ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పాటించాలన్న ప్రధాని పిలుపునకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన ట్వీట్‌ చేశారు. ‘‘ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మన కోసం ఎంతగానో శ్రమిస్తున్న వారిని కరతాళధ్వనులతో మెచ్చుకుంటా. ఒక్కరిగా ఉండండి. జాగ్రత్తగా ఉండండి. తగిన జాగ్రత్తలు పాటించండి’ అని అమితాబ్‌ కోరారు.

9. మోహన్‌బాబుకు సింహాసనం చేయించిన లక్ష్మి

టాలీవుడ్‌ నటుడు మోహన్‌బాబుకు ఆయన కుమార్తె మంచులక్ష్మి కొత్త సింహాసనం చేయించి ఇచ్చారు. గురువారం మోహన్‌బాబు పుట్టినరోజు సందర్భంగా సోషల్‌మీడియా వేదికగా ఆయనకు సంబంధించిన పలు ఫొటోలను షేర్‌ చేసిన మంచులక్ష్మి వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. ‘మా నాన్నకి కొత్త సింహాసనం.. ఈ సింహాసనంలోని మూడు సింహాలు.. మా ముగ్గురికి (లక్ష్మి, విష్ణు, మనోజ్‌) నిదర్శనం. నేనే దీనిని చేయించాను.’ అని మంచులక్ష్మి పేర్కొన్నారు.