News Updates1. అలసత్వం వద్దు

అన్ని రాష్ట్రాలకూ మహమ్మారి ముప్పు ఒకేలా ఉంది. కేంద్ర, రాష్ట్రాలు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరాన్ని అందరూ గుర్తించాలి. ఈ సవాలును ఎదుర్కోవడంలో ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి. వారిలో భయాందోళనలు రేకెత్తకుండా చూడాలి. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాపిస్తున్న దృష్ట్యా, నిరంతరం మనం నిఘా ఉంచడం చాలా కీలకం. అణుమాత్రం అలసత్వం వద్దు

2. కరోనా ప్రయోగశాలగా సీసీఎంబీ

నగరంలోని సెంటర్‌ ఫర్‌ సెల్యూలార్‌ అండ్‌ మాలిక్యులార్‌ బయాలాజీ (సీసీఎంబీ)ని కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే ప్రయోగశాలగా ఉపయోగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సూచించారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సీసీఎంబీని జీవసంబంధ పరిశోధనల కోసం ఉపయోగిస్తున్నారని, ఇక్కడ కరోనా నిర్ధారణ పరీక్షలకు అనుమతిస్తే ఒకేసారి 1,000 నమూనాలను పరీక్షించే అవకాశం కలుగుతుందని చెప్పారు. విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారానే వైరస్‌ ప్రబలే అవకాశం ఉన్నందున, కొన్నిరోజులపాటు అంతర్జాతీయ విమానాల రాకపోకలను పూర్తిగా నిలిపి వేయాలని కోరారు.

అని ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రులకు సూచించారు.

3. నిత్యావసరాలకు కొరత రాదు

కరోనాపై ఎవరైనా తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజల్ని ఆందోళనకు గురిచేస్తే కఠినచర్యలు తప్పవని ముఖ్యమంత్రి జగన్‌ హెచ్చరించారు. ఈ సాకుతో నిత్యావసరాల ధరలు పెంచితే తీవ్రమైన చర్యలుంటాయని స్పష్టం చేశారు. కరోనా నియంత్రణపై ఆయన శుక్రవారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ‘ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కరోనా వల్ల మనుషులు పిట్టల్లా రాలిపోతారన్న భయం నిజం కాదు. ఈ వైరస్‌ సోకితే మరణమే అన్న భయం వద్దు. నో టూ పానిక్‌.. ఎస్‌ టూ ప్రికాషన్స్‌ (భయాందోళనలు వద్దు.. జాగ్రత్తలు తీసుకుందాం) అన్నది మన నినాదం కావాలి’’ అని పేర్కొన్నారు.

4. సార్వత్రిక ఎన్నికల విరాళాలు రూ.6,400 కోట్లు

గత ఏడాది సార్వత్రిక ఎన్నికల సమయంలో 7 జాతీయ, 25 ప్రాంతీయ పార్టీలు కలిపి రూ.6,405.59కోట్ల విరాళాలు వసూలు చేసినట్లు ప్రజాస్వామ్య సంస్కరణలవేదిక (ఏడీఆర్‌) సంస్థ వెల్లడించింది. మొత్తం రాజకీయ పార్టీల్లో ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌బ్లాక్‌, ఐఎన్‌ఎల్‌డీలుమాత్రమే తాము ఎలాంటి నిధులూ వసూలుచేయలేదని, పైసాకూడా ఖర్చుపెట్టలేదని చెప్పాయి. జాతీయపార్టీలు తాము వసూలుచేసిన మొత్తంలో 36.16% మాత్రమే ఎన్నికల కోసం ఖర్చుపెడితే, ప్రాంతీయ పార్టీలు 68% ఖర్చు చేసినట్లు ఏడీఆర్‌ వెల్లడించింది.

5. రక్షణ కొనుగోళ్లకు కొత్త విధానం

రక్షణ కొనుగోళ్ల విధానం (డీపీపీ)-2020 ముసాయిదాను కేంద్రం శుక్రవారం ఆవిష్కరించింది. ఇందులో కొత్తగా ‘లీజింగ్‌’ విభాగాన్ని తెచ్చింది. అందుబాటు ధరల్లో రక్షణ సామగ్రిని సమకూర్చుకోవడం దీని ఉద్దేశం. ‘భారత్‌లో తయారీ’కి ఊతమిచ్చేందుకు వివిధ విభాగాల్లో స్వదేశీ వాటాను గణనీయంగా పెంచింది. కొత్త డీపీపీలో ‘కొనుగోలు (భారత-ఐడీడీఎం)’ విభాగాన్ని పూర్తిగా భారతీయ ఉత్పత్తులకే ప్రత్యేకించింది. వీటి రూపకల్పన, అభివృద్ధి, తయారీని దేశీయంగానే చేపట్టాలి. ఈ మొత్తం కాంట్రాక్టు విలువలో స్వదేశీ విడిభాగాల వాటా కనీసం 50 శాతం ఉండాలి.

6. పనిచేసే బ్యాంకుకే టోకరా!

‘‘బ్యాంకులో మేనేజర్‌ ఉద్యోగమంటే బ్యాంకంతా మనదే.. మనమే రుణాలు తీసుకుందాం.. లాభాలొస్తే కట్టేద్దాం.. నష్టాలొస్తే కిస్తీలు కట్టకుండా వదిలేద్దాం’’ అనుకున్నాడు హైదరాబాద్‌లోని ఓ బ్యాంక్‌ మేనేజర్‌. అనుకున్నదే తడవుగా తన పేరుతో ఖాతా తెరిచి రూ.20 లక్షల ఓవర్‌ డ్రాఫ్ట్‌ తీసుకున్నాడు. తన పరిచయస్థులు, స్నేహితులకు ఎడాపెడా రుణాలిచ్చేశాడు. అందరం తలాకాస్తా తీసుకుందామని చెప్పడంతో బ్యాంకులో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులూ మేనేజర్‌కు వంతపాడారు. ఆరేడు నెలల వ్యవధిలో ఇలా రూ.10.20 కోట్లను రుణాల రూపంలో పంపిణీ చేశాడు.

7. ‘కరోనా’ వ్యాక్సిన్‌ తయారుచేసే సత్తా మనకు ఉంది

కరోనా వైరస్‌ గుర్తించలేనిది, తెలియనిదేమీ కాదు. ఈ జబ్బు స్వైన్‌ఫ్లూ కంటే ప్రమాదకరమైనది కూడా కాదు. కాకపోతే ఇది ఎంతో వేగంగా విస్తరిస్తుంది. పైగా మందులేదు. అదే ఆందోళన కలిగించే అంశం’’ అని వ్యాక్సిన్ల తయారీలో అగ్రగామిగా ఉన్న భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ సీఎండీ డాక్టర్‌ కృష్ణ ఎల్ల అన్నారు. ఈ వ్యాక్సిన్‌ను మనం తయారు చేయగలం... చైనా, యూకే, యూఎస్‌లోని శాస్త్రవేత్తలకు దీటుగా మనదేశంలో శాస్త్రవేత్తలు, వ్యాక్సిన్‌ను తయారు చేయగల సంస్థలు ఉన్నాయి, కాకపోతే ప్రభుత్వ పరంగా పూర్తిస్థాయిలో మద్దతు అవసరమని అభిప్రాయపడ్డారు.

8. ధోని నిశ్శబ్దంగా నిష్క్రమిస్తాడు

కరోనా కారణంగా ఐపీఎల్‌ వాయిదా పడింది. అసలు జరుగుతుందో లేదో కూడా తెలియదు. దీంతో ఈ టోర్నీలో మెరుగైన ప్రదర్శన భారత జట్టులోకి వస్తాడనుకున్న ధోని భవిష్యత్తుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మాజీ కెప్టెన్‌ గావస్కర్‌ మాత్రం ధోని తిరిగి భారత జట్టులోకి వచ్చే అవకాశాలు దాదాపుగా లేవని అంటున్నాడు. అతడు నిశ్శబ్దంగా రిటైరైపోతాడని చెప్పాడు. ‘‘ధోని ప్రపంచకప్‌ జట్టులో ఉండాలని నాకూ ఉంది. కానీ ఆ అవకాశాలు దాదాపుగా లేవు. అతడు లేనట్టేనని భావించి జట్టు ముందుకు సాగుతోంది. ధోని హడావుడి ప్రకటనలు చేసే వ్యక్తి కాదు. ఆట నుంచి అతడు నిశ్శబ్దంగా నిష్క్రమిస్తాడు’’ అని గావస్కర్‌ అన్నాడు.

9. కాజల్‌ ఖాయమైంది

అగ్ర కథానాయకుడు చిరంజీవితో కలిసి మరోసారి నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది కాజల్‌ అగర్వాల్‌. వీళ్లిద్దరూ ఇదివరకు ‘ఖైదీ నంబర్‌ 150’లో జోడీ కట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ తెరకెక్కుతోంది. ఇందులో నాయికగా మొదట త్రిష ఎంపికైంది. అయితే ఆమె ఇటీవల సినిమా నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. దాంతో అనుష్కతో పాటు పలువురు నాయికల పేర్లు వినిపించాయి. తాజాగా ‘ఆచార్య’ బృందం కాజల్‌ని ఖాయం చేసింది.

10. ఆరుగురి ప్రాణాలు తీసిన అతివేగం

అతివేగం ఆరు నిండు ప్రాణాలను బలిగొంది. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం ఈతముక్కల గ్రామ సమీపంలో బకింగ్‌హామ్‌ కాలువ వద్ద శుక్రవారం రాత్రి అతివేగంగా వెళుతున్న కారు ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల కథనం ప్రకారం... కొత్తపట్నం మండలం మడనూరు ఎస్సీ కాలనీకి చెందిన మేడికొండ బ్రహ్మయ్య (35) తన ఆటోలో ప్రయాణికులను ఎక్కించుకుని ఒంగోలు నుంచి స్వగ్రామానికి బయలుదేరాడు.