News Updates



ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా యువ బ్యాట్స్‌మన్‌ శ్రేయస్‌ అయ్యర్‌కు మ్యాజిక్‌ ట్రిక్‌లంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇదివరకే పలుమార్లు తన మాయాజాలం ప్రదర్శించి ఆకట్టుకున్నాడు. తాజాగా శ్రేయస్‌ తన సోదరితో ప్రదర్శించిన ‘గన్‌ ట్రిక్‌’ను ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది. శ్రేయస్‌ సోదరి నటాషా వాలంటీర్‌గా ముందుకొచ్చింది. ‘మీ ముందుకు వస్తున్నాడు.. మన జట్టులోని మెజీషియన్‌ శ్రేయస్‌ అయ్యర్‌.. మేమంతా ఇళ్లల్లో ఉంటుండగా, మా అందరికీ సంతోషాన్ని పంచినందుకు ధన్యవాదాలు శ్రేయస్‌ అయ్యర్‌’ అని పోస్టులో పేర్కొంది.

కాగా, ప్రస్తుతం కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని క్రీడా పోటీలు రద్దవ్వడం లేదా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భారత క్రికెటర్లు సైతం తమ ఇళ్లకే పరిమితమయ్యారు. కుటుంబసభ్యులతో కలిసి సంతోషంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే శ్రేయస్‌ అయ్యర్‌ తన మ్యాజిక్‌ ట్రిక్‌ను ప్రదర్శించడం విశేషం. ఇంతకీ ఆ మ్యాజిక్‌ ట్రిక్‌ ఏంటో తెలుసా..? తొలుత అయ్యర్‌ కొన్ని పేకముక్కల్ని తీసుకొని అందులో ఒకటి ఎంపిక చేసుకోమని తన సోదరికి చెప్తాడు. ఆమె ఒక కార్డును తీసుకొని మనకు చూపిస్తుంది. దాన్ని మళ్లీ ఆ పేకముక్కల్లో కలిపాక శ్రేయస్‌ మరోకార్డుని ఎంపిక చేసుకోమని చెబుతాడు. అలా నటాషా రెండో ముక్కను తీసి మళ్లీ పేకముక్కల్లో కలిపాక శ్రేయస్‌ అయ్యర్‌ తన ట్రిక్‌ను ప్రదర్శిస్తాడు. నటాషా తొలిసారి ఎంపిక చేసుకున్న పేకముక్కను బయటకు విసురుతాడు. ఈ మ్యాజిక్‌ చూడ్డానికి భలేగా ఉంది. కావాలంటే మీరు ఒక లుక్కేయండి..

~~~~