News Updates



ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ (కొవిడ్‌ 19) నుంచి తప్పించుకోవడం ఎలాగో డారెన్‌ సామీని చూసి నేర్చుకోవాలి. వెస్టిండీస్‌ మాజీ సారథి ఇటీవల పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ ఆడిన సంగతి తెలిసిందే. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పీసీబీ తమ టీ20 లీగ్‌ను సెమీఫైనల్స్‌, ఫైనల్స్‌ నిర్వహించకుండానే రద్దు చేసింది. ఈ క్రమంలోనే విదేశీ ఆటగాళ్లు తమ స్వదేశాలకు పయనమయ్యారు. సామీ కూడా ఇంటికెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకున్నాడు. వైరస్‌బారి నుంచి తప్పించుకునేందుకు, ఎవరూ గుర్తుపట్టలేని విధంగా ఉన్న ఒక ప్రత్యేక మాస్క్‌ ధరించాడు.

ఆ ఫొటోను ట్విటర్‌లో పోస్టు చేస్తూ స్వదేశానికి చేరుకున్నానని చెప్పాడు. పాకిస్థాన్‌ నుంచి బయలుదేరే ముందు కరోనా పరీక్షలు చేయించుకోగా తనకు నెగిటివ్‌ రిపోర్టు వచ్చిందని, అయినా ఇంటికెళ్లిన అనంతరం కుటుంబ సభ్యులతో కలవకుండా 14 రోజులు స్వీయ నిర్బంధంలో ఉంటానని చెప్పాడు. మరోవైపు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. సామాజిక దూరం పాటించే విషయాన్ని తెలియజేస్తూ డాన్స్‌ చేస్తున్న వీడియో హాస్యాస్పదంగా ఉంది. ఇదిలా ఉండగా ఇటీవల పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ ఆడిన ఆటగాళ్లకు, సహాయక సిబ్బందికి మొత్తం కరోనా టెస్టులు నిర్వహించారు. ఎవరికీ పాజిటివ్‌ రిపోర్టు రాకపోవడంతో పీసీబీ ఊపరి పీల్చుకుంది.

~~~~