News Updates



దిల్లీ: నాట్‌వెస్ట్‌ ట్రోఫీ ఫైనల్లో టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్‌, మహ్మద్‌ కైఫ్ పోరాడిన రీతిలో కరోనా వైరస్‌పై యావత్‌ భారత్‌ పోరాడాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశ వ్యాప్తంగా మహమ్మారి కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో సామాజిక దూరం పాటించడం కోసం ఆదివారం జనతా కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలు స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూ పాటించాలని మోదీ కోరారు. దీన్ని స్వాగతిస్తూ భారత క్రికెటర్లు, ప్రముఖులు సామాజిక మాధ్యమాల్లో తమ మద్దతు తెలుపుతున్నారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా స్వచ్ఛందంగా సామాజిక దూరం పాటించాలని మహ్మద్‌ కైఫ్‌, యువరాజ్‌ సింగ్‌ కూడా ట్వీట్‌లు చేశారు. దీనికి మోదీ స్పందించారు.

‘‘ఇక్కడ ఇద్దరు (కైఫ్‌, యువరాజ్‌) అద్భుతమైన క్రికెటర్లు ఉన్నారు. వారి భాగస్వామ్యం మనం ఎప్పటికీ మరవలేనిది. వారు చెప్పినట్లుగా ఇప్పుడు మరో కీలక భాగస్వామ్యం నెలకొల్పాల్సి ఉంది. అయితే, ఈ సారి కరోనాపై చేసే పోరాటంలో యావత్‌ భారత్‌ మొత్తం భాగస్వామ్యం అవ్వాలి’’ అని మోదీ ట్వీట్‌ చేశారు. 2002లో జరిగిన నాట్‌వెస్ట్ ట్రోఫీ ఫైనల్లో భారత్‌కు ఇంగ్లాండ్‌ 326 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేదనకు దిగిన టీమ్‌ఇండియా 146 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే యువీ-కైఫ్‌ కలిసి ఆరో వికెట్‌కు 121 పరుగులు జోడించారు. యువీ 69 పరుగుల వద్ద వెనుదిరిగినా కైఫ్‌ (87*) ఆఖరి వరకు క్రీజులో నిలబడి జట్టును గెలిపించాడు. భారత క్రికెట్‌ చరిత్రలో ఇదో గొప్ప విజయంగా పరిగణిస్తారు.