News Updates



హైదరాబాద్: టాలీవుడ్‌లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ^^ఆర్‌ఆర్‌ఆర్‌ (రౌద్రం రణం రుధిరం)^^. తెలుగు సినీ పరిశ్రమలో రెండు అగ్ర కుటుంబాలకు చెందిన ఇద్దరు హీరోలతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్నారు. దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఈ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకు వెళ్లడానికంటే ముందు బ్యాగ్రౌండ్‌లో ఎన్నో పనులు జరిగాయి. ఈ విషయంపై ఒకానొక సందర్భంలో రాజమౌళి స్పందిస్తూ.. ^^తారక్‌, చరణ్‌లతో కలిసి ఇప్పటికే నేను కొన్ని భారీ బ్లాక్‌బస్టర్‌ చిత్రాలను తెరకెక్కించాను. సినీ నేపథ్యం ఉన్న రెండు కుటుంబాలకు చెందిన చరణ్‌, తారక్‌లను ఈ సినిమా ద్వారా ఒకేసారి కలిసి పనిచేయనున్నారు. నిజజీవితంలో వాళ్లిద్దరూ మంచి స్నేహితులు. అదే నాకు ఉన్న అడ్వాంటేజ్‌. ^^ఆర్‌ఆర్‌ఆర్‌^^ సినిమా గురించి నాకు ఉన్న ఆలోచనను వాళ్లతో చెప్పగానే వెంటనే ఓకే చెప్పేశారు. షూటింగ్‌కు వెళ్లడానికికంటే ముందు మేము క్యారెక్టర్‌ డిజైనింగ్‌ సెషన్స్‌లో పాల్గొన్నాం. క్యారెక్టరైజేషన్‌కు సంబంధించిన స్కెచ్‌లు గీశాం. వాళ్లిద్దరూ వారి వారి పాత్రల్లో ఎంతగానో ఒదిగిపోయారు^^ అని తెలిపారు.

డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమరంభీమ్‌గా ఎన్టీఆర్‌ కనిపించనున్నారు. రామ్‌చరణ్‌కు జంటగా బాలీవుడ్‌ నటి ఆలియాభట్‌, ఎన్టీఆర్‌కు జంటగా హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరీస్‌ సందడి చేయనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 8న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం భావిస్తోంది. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా ^^ఆర్‌ఆర్‌ఆర్‌^^ చిత్రానికి సంబంధించిన పనులు వాయిదా పడ్డాయి.