News Updates



సియోల్‌: ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఆరోగ్యంపై ప్రపంచవ్యాప్తంగా అనేక కథనాలు వినిపిస్తున్నాయి. అయినప్పటికీ ఈ వార్తలపై ఉత్తర కొరియా ఇప్పటివరకూ స్పందించలేదు. కిమ్‌పై వస్తున్న వార్తలపై అక్కడి మీడియా కూడా మౌనం ప్రదర్శిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా దీనిపై ఇంత చర్చ నడుస్తున్నా బుధవారం అక్కడి పత్రికల్లో ఎక్కడా కిమ్‌కు సంబంధించిన వార్తలు రాకవడం గమనార్హం. ఉత్తర కొరియా అధికారిక వార్తా ఏజెన్సీ కేసీఎన్‌ఏ(కొరియన్‌ సెంట్రల్‌ న్యూస్‌ ఏజెన్సీ), అక్కడి అధికారిక పత్రిక రోడోంగ్‌ సిన్మన్‌ కూడా అధినేత ఆచూకి, ఆరోగ్య విషయంపై ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. క్రీడలు, ఆర్థిక విషయాలు, కరోనా వైరస్‌ ముందస్తు చర్యలకు సంబంధించిన వార్తలనే ప్రముఖంగా ప్రచురించాయి. అయితే అధినేత కిమ్‌ కొందరు ప్రముఖ వ్యక్తులకు మాత్రం పుట్టినరోజు బహుమతులను పంపించినట్లు పేర్కొన్నాయి.

ఇదిలా ఉంటే, కిమ్‌ ఆరోగ్యంపై అమెరికా మీడియాలో పలు కథనాలు వస్తుండగా అధ్యక్షుడు కూడా స్పందించిన విషయం తెలిసిందే. తాజాగా డొనాల్డ్‌ ట్రంప్ కిమ్‌ తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కిమ్‌ అనారోగ్యంతో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని..ఒకవేళ అదే నిజమైతే ఆయన తొందరగా కోలుకోవాలని ట్రంప్‌ వెల్లడించారు. దక్షిణ కొరియా, చైనా మాత్రం కిమ్‌ ఆరోగ్యంపై తమకు ఎలాంటి సమచారం లేదని.. మీడియాలో వస్తున్న వార్తలను తోసిపుచ్చాయి. ఈ సమయంలో ఉత్తర కొరియా మౌనం ప్రదర్శించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.