News Updates



హైదరాబాద్‌: టాలీవుడ్‌ స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం పుష్ప . సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. లారీడ్రైవర్‌ లుక్‌లో బన్నీ కనిపించనున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటించనున్నారని ఇప్పటికే చిత్రబృందం అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం పుష్ప చిత్రంలో మరో కథానాయికగా నివేదా థామస్‌ సందడి చేయనున్నారట. బన్నీ ప్రియురాలి పాత్రలో నివేదా కనిపించనున్నారని.. అంతేకాకుండా నివేదా థామస్‌ పాత్రకు పుష్ప  సినిమాలో ఎంతో ప్రాధాన్యత ఉంటుందని టాలీవుడ్‌లో టాక్‌ వినిపిస్తోంది. మరోవైపు రష్మిక.. అటవీ శాఖ అధికారి పాత్రలో కనిపించనున్నారని సమాచారం. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

అల్లు అర్జున్‌ పుట్టినరోజు సందర్భంగా ఇటీవల విడుదల చేసిన  పుష్ప  ఫస్ట్‌లుక్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. మైత్రి మూవీ మేకర్స్‌, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించనున్నారు. హాలీవుడ్‌కు చెందిన మిరోస్లా కుబా బ్రోజెక్‌ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. కరోనా వైరస్‌ కారణంగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను కొంతకాలం పాటు నిలిపివేశారు.